Bharatiya Samskruthi-I    Chapters   

కృతజ్ఞతా నివేదనము

ఆధ్యాత్మ తత్త్వజిజ్ఞాసువులైన పాఠకుల కరకమలముల యందు ఉన్న ఈ 'భారతీయ సంస్కృతి' (పరిచయము) అను గ్రంథము, భారతీయ సంస్కృతియందు గల వైశిష్ట్యమును, మహత్త్వమును అధునాతనులకు ఖ్యాపనము చేయుచు, విరాజిల్లు నట్టి గ్రంథము. ఇందు, భారతీయ సంస్కృతిఖ్యాపకములైన రెండు వ్యాసములు పొందుపరచబడినవి. వీనివలన, సంస్కృతి యనగానేమో, భారతీయ సంస్కృతీ వైభవమేమో, పాఠకులకు స్థూలముగ అవగతము కాగలదు. దేవశిల్పము లన్నియు, సంస్కృతిలో అంతర్భాగములయి ఉన్నవి. ఈ గ్రంథమునందు ఆదిత్య అంబికా, విష్ణు, గణనాథ, మహేశ్వర రూపులైన 'పంచాయతన' దేవతల మహత్త్వము , ఆయా దేవతల స్తోత్రాదులు జిజ్ఞాసు పాఠకులు పారాయణము చేసికొని, జీవితమును సార్థకము చేసికొనుటకు పొందుపరచబడినవి. జిజ్ఞాసుహృదయులందరును, ఈ గ్రంథమును పఠించి, మననము చేసికొని, తమ జీవితసాఫల్యమునకై ప్రయత్నింతురు గాక.

నాచే రచింపబడిన 'జీవన్ముక్తి వివేకః', 'పఞ్చపాదికా', 'సిద్ధాన్తబిన్దుః'- ఇత్యాది గ్రంథముల ప్రకాశనమునకే కాక, ఈ 'భారతీయ సంస్కృతీ' గ్రంథ ప్రకాశమునకు గూడ, సహకరించిన బ్రహ్మ శ్రీ ఆకెళ్ళ శివరామబ్రహ్మం గారికి, చిరంజీవులగు వారి కుమారులకు నా కృతజ్ఞతాభినందనలు.

వీరేగాక, ఉదాత్త హృదయులు, మహానుభావులు అయిన వారెందరో , ఈ గ్రంథములు వెలుగులోనికి వచ్చుటకు తోడ్పడి యున్నారు. బ్రహ్మశ్రీ పఞ్చగ్నుల వేంకటరమణశర్మగారు, చిరంజీవులు, వారి కుమారులు పి. వి. కమలాకరశర్మగారు, బ్రహ్మ శ్రీ దువ్వూరి ద్వారకా విశ్వనాథశర్మగారు, బ్రహ్మశ్రీ మాగంటి రామలింగశర్మగారు, చిరంజీవులు శ్రీ చెరువు శంకరస్వామిగారు, శ్రీ కామరాజుగడ్డ పూర్ణానందశర్మగారు, శ్రీ ఆనందుల బాలరెడ్డి గారు, శ్రీ వింజమూరి లక్ష్మణరావు గారు, బ్రహ్మ శ్రీ కోనాపురం నారాయణరావు గారు - ఈ ఉదారాశయులందరు పరమేశ్వరానుగ్రహముచే దీర్ఘాయుష్మంతులై, శాన్తి, సౌఖ్యములతో వర్థిల్లుదురు గాక.

నేను ధారావాహికముగ చెప్పుచుండగా మహాకౌశలముతో లేఖనమొనర్చిన, ప్రాచ్య, పాశ్చాత్య విజ్ఞాన సంపన్నులయిన డాక్టర్‌ కె. గోవిందశర్మ, M.sc., PH.D. గారికి, అటులనే, గ్రంథ ముద్రణ భారము వహించి, ఈ గ్రంథములకు రూపుదిద్దిన బ్రహ్మశ్రీ జనస్వామి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, బ్రహ్మశ్రీ హరి వెంకటేశ్వర శర్మగారికి ఆనంద నిర్భర హృదయముతో ఆశీస్సుల నొనగు చున్నాను,

నయనానన్దకరముగా ముద్రింపజేసిన వాణీ ఆర్టు ప్రింటర్సు యజమానులు చిరంజీవులయిన శ్రీ తాతా శంకరరావుగారు, వారి కార్యకర్తలు పి. నారాయణరెడ్డి, బి, శశిధర్‌, పి. నాగేశ్వరరావు గార్లు, అందముగా బైండు చేసి యిచ్చుచున్న బి. వెంకటేశ్వర్లుగారు పరమేశ్వరానుగ్రహముచే ఆయురారోగ్యములతో, సుఖశాన్తులతో వర్ధిల్లుదురు గాక.

సర్వే జనాః సుఖినో భవన్తు.

హైదరాబాదు, ఇట్లు

ఈశ్వర శ్రావణమాసము సుధీవిధేయుడు

సూరి రామకోటిశాస్త్రి

Bharatiya Samskruthi-I    Chapters